: కొత్త సచివాలయంలో పాత ఫర్నీచర్ వద్దు!... వచ్చే నెల 21లోగా అంతా తరలాల్సిందే!: ఏపీ సీఎస్ ఆదేశం
నవ్యాంధ్ర పాలన నూతన రాజధాని అమరావతికి తరలిపోతోంది. ఇందులో నేడు కీలక ఘట్టం జరగనుంది. అమరావతి పరిధిలోని వెలగపూడిలో శరవేగంగా సిద్ధమవుతున్న తాత్కాలిక సచివాలయం ప్రారంభం లాంఛనంగా నేటి మధ్యాహ్నం 2.59 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుంచి ఐదు బస్సుల్లో తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో అమరావతిలో ప్రారంభం కానున్న సచివాలయం, ఉద్యోగుల తరలింపునకు సంబంధించి నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త సచివాలయంలో పాత ఫర్నీచర్ ను ఏమాత్రం వాడరాదని ఆయన ఆ ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా వచ్చే నెల 21లోగా సెక్రటేరియట్ లోని అన్ని శాఖల ఉద్యోగులు అమరావతికి తరలిరావాల్సిందేనని కూడా ఆయన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.