: కొనుగోలు మద్దతుతో బీఎస్ఈకి రూ. 57 వేల కోట్ల లాభం!
భారీ నష్టాలు, ఆపై అనిశ్చితి తరువాత, కొత్త కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ప్రయత్నించడంతో భారత స్టాక్ మార్కెట్ లాభాల్లోకి నడిచింది. బ్రెగ్జిట్ ప్రభావం మార్కెట్లపై స్పష్టంగా కనిపించిన తరువాత, నూతన కొనుగోళ్లు నమోదు కావడం ఇదే తొలిసారి. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత ఈక్విటీలను సొంతం చేసుకునేందుకు యత్నించారు. దీంతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 57 వేల కోట్లకు పైగా లాభపడింది. చిన్న, మధ్య తరహా కంపెనీల ఈక్విటీలు సైతం లాభపడ్డాయి. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 121.59 పాయింట్లు పెరిగి 0.42 శాతం లాభంతో 26,524.55 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 33.15 పాయింట్లు పెరిగి 0.41 శాతం లాభంతో 8,127.85 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.48 శాతం, స్మాల్ కాప్ 0.79 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 29 కంపెనీలు లాభపడ్డాయి. లుపిన్, ఐడియా, ఇన్ ఫ్రాటెల్, హిందుస్థాన్ యూనీలివర్, బోష్ లిమిటెడ్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, హిందాల్కో, టీసీఎస్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,786 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,594 కంపెనీలు లాభాలను, 1,000 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. సోమవారం నాడు రూ. 1,00,13,695 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,00,70,495 కోట్లకు పెరిగింది.