: తెలంగాణలో హీటెక్కిన ‘న్యాయ’ పోరు!... మరో ఐదుగురు జడ్జీలపై వేటు!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనలో జాప్యం, న్యాయాధికారుల నియామకాల్లో అన్యాయం, ఏపీ న్యాయమూర్తులకు ఆప్షన్ లను ప్రశ్నిస్తూ తెలంగాణ లాయర్లు చేపట్టిన ఆందోళనలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. నిన్నటికి నిన్న ఆందోళనలకు మద్దతిచ్చారన్న కారణాన్ని చూపి ఇద్దరు జడ్జీలపై సస్పెన్షన్ వేటు వేసిన హైకోర్టు నేడు కూడా తన విశేషాధికారాన్ని ప్రయోగించింది. పరిస్థితులు చక్కబడకపోవడం, సాక్షాత్తు న్యాయమూర్తులే ఆందోళనలకు మద్దతిస్తున్నారన్న ఆరోపణలపై కొద్దిసేపటి క్రితం మరో ఐదుగురు జడ్జీలపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా సస్పెన్షన్ కు గురైన వారిలో తెలంగాణ న్యాయాధికారుల సంఘం ఉపాధ్యక్షులు సున్నం శ్రీనివాసరెడ్డి,చంద్రశేఖర్ ప్రసాద్ లతో పాటు న్యాయమూర్తులు రాధాకృష్ణ చౌహాన్, రమాకాంత్, తిరుపతి ఉన్నారు. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డారన్న కారణంతోనే వారిని సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.