: కట్నం తేలేని రాజస్థాన్ మహిళపై దారుణం!... సోదరులతో కలిసి భర్త అత్యాచారం... ఆపై ‘నా తండ్రి దొంగ’ అంటూ నుదుటిపై టాటూ వేసిన వైనం!


దేశంలో మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెళ్లి తంతుతో తల్లిదండ్రులను వదిలి వచ్చిన ఓ యువతిని అత్తింటి వారు నానా చిత్రహింసలకు గురి చేశారు. కేవలం మాట ఇచ్చిన కట్నం అందలేదన్న ఒకే ఒక్క కారణంతో ఆమెపై భర్త తన ఇద్దరు సోదరులతో కలిసి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బాధితురాలిని తీవ్రంగా కొట్టి, నుదురు, చేతులపై టాటూలు వేశారు. ఆ టాటూల్లో ‘‘మేరా బాప్ చోర్ హై (నా తండ్రి దొంగ)’’ అంటూ ఆ మహిళ శరీరంపై రాయించారు. రాజస్థాన్ లోని అంబర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఎలాగోలా పోలీస్ స్టేషన్ చేరుకుని ఈ దుర్మార్గంపై ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళితే... అల్వార్ జిల్లా అంబర్ కు చెందిన దినారామ్ తన కూతురును సమీపంలోని రేని గ్రామానికి చెందిన జగన్నాథ్ కిచ్చి గతేడాది జనవరిలో పెళ్లి చేశాడు. వివాహం సందర్భంగా జగన్నాథ్ కుటుంబం రూ.51 వేల కట్నాన్ని డిమాండ్ చేసింది. అయితే దినారామ్ కుటుంబం ఆ మేర కట్నాన్ని ఇచ్చుకోలేకపోయింది. ఆరు నెలలు బాగానే ఉన్నా ఆ తర్వాత కట్నం కోసం బాధితురాలిపై వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే జగన్నాథ్ తన సోదరులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. కట్నం కోసం వేధించాడు. తీవ్రంగా కొట్టాడు. అప్పటికీ కోపం చల్లారక నుదురు, చేతులపై ‘నా తండ్రి దొంగ’ అంటూ పచ్చబొట్లు పొడిపించాడు. దీనిపై సమాచారం అందుకున్న దినారామ్ రేనికి వెళ్లి కూతురును ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ షాక్ కు గురయ్యారు. జాతీయ మహిళా కమిషన్ కు విషయాన్ని చేరవేసిన ఆమె, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News