: ఢిల్లీలో మెడికల్ కౌన్సిల్ భేటీ... ఏపీ విద్యార్థుల సమస్యలు ఏకరువు పెట్టిన కామినేని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగించాల్సిన మెడికల్ కోర్సులపై సమయానికి అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఢిల్లీలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశం జరుగగా, ఆంధ్రప్రదేశ్ తరఫున కామినేని హాజరయ్యారు. మెడికల్ కోర్సులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్ర విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులై కూడా, కౌన్సిల్ సత్వర నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, ఏ కోర్సును ఎంచుకోవాలో తెలియక సతమతమవుతున్నారని వివరించారు. ఈ విషయంలో మెడికల్ కౌన్సిల్ నుంచి వెంటనే స్పష్టత ఇవ్వాలని కామినేని కోరారు.