: ఎట్టకేలకు ముంబైకి గ్యాంగ్ స్టర్ కుమార్ పిళ్లై!... నెలల తరబడి కష్టపడ్డ ముంబై పోలీసులు!
శ్రీలంకలో సుదీర్ఘ కాలం పాటు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన ఎల్టీటీఈతో సంబంధాలున్నాయని భావిస్తున్న ముంబై గ్యాంగస్టర్ కుమార్ పిళ్లైని పోలీసులు భారత్ కు తీసుకురాగలిగారు. గత ఫిబ్రవరిలో సింగపూర్ లో అరెస్టైన పిళ్లైపై ముంబైలో హత్య, హత్యాయత్నం, బెదిరించి డబ్బు వసూలు చేయడం వంటి పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ముంబైలోని విక్రోలీ, బాందుప్ ల్లో 1990కి ముందు చిన్నపాటి నేరాలతో మొదలెట్టిన పిళ్లై... కాలక్రమంలో గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడు. ఆ రెండు ప్రాంతాల్లో పలు నేరాలకు పాల్పడ్డ అతడు బిల్డర్లను బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసే స్థాయికి చేరాడు. ఈ క్రమంలో ఓసారి పోలీసులు అరెస్ట్ చేయగా, బెయిల్ పై బయటకు వచ్చిన అతడు... తిరిగి తన నేర ప్రవృత్తిని కొనసాగించాడు. ఈ క్రమంలో పోలీసుల నిఘా పెరగడంతో అతడు సింగపూర్ పారిపోయాడు. ముంబై పోలీసుల అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ అతడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. దీంతో సింగపూర్ లోనే ఫిబ్రవరిలో పోలీసులకు చిక్కిన పిళ్లైని ముంబై తీసుకొచ్చేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు అతడిని భారత్ తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రక్రియను దిగ్విజయంగా పూర్తి చేసిన ముంబై పోలీసులు నిన్న రాత్రి 10 గంటలకు నగరంలోని అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ల్యాండైన సింగపూర్ విమానంలో అతడిని భారత్ కు తీసుకొచ్చారు.