: రైళ్లలో ఇక పిజ్జాలు, బర్గర్లు కూడా లభిస్తాయి!


మీకు పిజ్జాలు, బర్గర్లు వంటి వెస్ట్రన్ ఫుడ్ ఇష్టమా? రోజుల తరబడి రైళ్లలో ప్రయాణిస్తూ, వీటిని తినలేకపోతున్నామని బాధపడుతున్నారా? లేదా రైల్లో ఓసారి వెస్ట్రన్ ఫుడ్ టేస్ట్ చూద్దామని అనుకుంటున్నారా? అయితే, త్వరలోనే మీ కోరిక తీరనుంది. ఇందుకోసం ఐఆర్సీటీసీ, భారతీయ రైల్వేలు పలు క్విక్ సర్వీస్ రెస్టారెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ డీల్స్ లో భాగంగా, ముందుగా వచ్చే ఆర్డర్లతో పాటు, ప్లాట్ ఫారాలపై నిలబడి తినేందుకు సిద్ధంగా ఉండే పిజ్జాలు, బర్గర్లు ఇతర ఆహార పదార్ధాలను వెండార్ బాయ్స్ విక్రయిస్తారు. ఈ మేరకు డొమినోస్ పిజ్జా, బర్గర్ కింగ్, సబ్ వే, కేఎఫ్సీ, పిజ్జా హట్ తదితరాలతో ఒప్పందాలు కుదిరాయి. నిత్యమూ 12 వేలకు పైగా రైళ్లు 2.3 కోట్ల మంది అవసరాలను తీరుస్తున్న వేళ, రైళ్లలో మరింత తాజా ఆహారం అందించాలని, అందరూ కోరుకునే పదార్థాలను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గౌరవ్ దివాన్ తెలిపారు. తొలి దశలో హౌరా, ముంబై, మధురై, ఆగ్రా, పుణె, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని, సరాసరిన రూ. 100 నుంచి రూ. 125 ధరలో ఫుడ్ లభిస్తుందని వివరించారు. రైల్వేల కోసమే ప్రత్యేకంగా మెనూను సిద్ధం చేస్తున్నట్టు డొమినోస్ పిజ్జా పేర్కొంది. రైలు ప్రయాణికుల కోసం నాలుగు అంగుళాలుండే శాండ్ విచ్ ని తొలిసారిగా తయారు చేస్తున్నామని, దీని ఖరీదు రూ. 70గా నిర్ణయించామని సబ్ వే పేర్కొంది. కాగా, రైళ్లలో వెస్ట్రన్ ఫుడ్ అందించాలన్న ఆలోచన, లాభాలను తీసుకురావడం కొన్ని సవాళ్లతో కూడుకున్నదేనని నిపుణులు భావిస్తున్నారు. రెస్టారెంట్లు, లోకల్ వెండార్లతో పోటీ పడి పుడ్ ప్రొడక్టులను అందించాల్సి వుంటుందని, ధరలు రెస్టారెంటులో ఉన్నట్టుగా ఉంటే ప్రయాణికులు దూరమయ్యే ప్రమాదముందని, లేకుంటే కస్టమర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఎడిల్ వైజెస్ సెక్యూరిటీస్ అనలిస్ట్ అబ్నీష్ రాయ్ అంచనా వేశారు. ఇదే సమయంలో నిత్యమూ వేల రైళ్లు ఆలస్యంగా తిరిగే ఇండియాలో వేడి వేడి ఆహారాన్ని వీరు ఎలా అందించగలరని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News