: టెక్కీ స్వాతి హత్యకేసులో పోలీసులకు మొట్టికాయలు.. రెండు రోజుల డెడ్లైన్ విధించిన మద్రాస్ హైకోర్టు
చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్లో శుక్రవారం పట్టపగలు ఐటీ ఉద్యోగిని స్వాతి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్య జరిగి రోజులు గడుస్తున్నా ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో మద్రాస్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పోలీసులకు మొట్టికాయలు వేసింది. రెండు రోజుల్లో కేసు పురోగతిని చూపించాలని ఆల్టిమేటం ఇచ్చింది. ‘‘రెండు రోజుల తర్వాత కూడా దర్యాప్తు మందకొడిగా సాగుతున్నట్టు మాకు అనిపిస్తే చీఫ్ జస్టిస్ ఆదేశాలతో సుమోటోగా స్వీకరించి విచారిస్తాం’’ అని ధర్మాసనం హెచ్చరించింది. స్వాతి హత్య జరిగి మూడు రోజులు గడిచినా నిందితుడిని గుర్తించడంలో పోలీసులు విఫలం కావడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ కేసును రైల్వే పోలీసుల నుంచి సిటీ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేయనున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(నుంగంబాకం) కేపీఎస్ దేవరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును దర్యాప్తు చేయనుంది. కాగా హత్యకు గురైన స్వాతి మృతదేహాన్ని రెండు గంటలపాటు స్టేషన్లోనే ఎగ్జిబిషన్ మాదిరిగా ఎందుకు వదిలేశారని రైల్వే పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది.