: అమరావతిలో సందడి!... వెలవెలబోయిన హైదరాబాదులోని సర్కారీ ఆఫీసులు!
ఏపీ పాలన నవ్యాంధ్ర నూతన రాజధానికి దాదాపుగా తరలిపోయింది. ఇప్పటికే సీఎం నారా చంద్రబాబునాయుడు పూర్తిగా విజయవాడ నుంచే తన కార్యకలాపాలు సాగిస్తున్నారు. తాజాగా మెజార్టీ ప్రభుత్వ శాఖలు అమరావతి పరిసరాలైన గుంటూరు, విజయవాడలకు తరలివెళ్లాయి. ఈ నేపథ్యంలో నిన్న అమరావతిలో సందడి వాతావరణం నెలకొంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 14 కార్యాలయాలు ఏర్పాటు కావడంతో అక్కడ ప్రారంభోత్సవాల సందడి కనిపించింది. అయితే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులోని ఆయా శాఖల ప్రధాన కార్యాలయాలు (హెచ్ఓడీలు) మాత్రం వెలవెలబోయాయి. అమరావతిలో కార్యాలయాల ప్రారంభోత్సవం నేపథ్యంలో మరికొంత కాలం పాటు హైదరాబాదులోనే ఉండాల్సిన ఉద్యోగులు కూడా నిన్న అమరావతికి తరలివెళ్లారు. దీంతో హైదరాబాదులోని కార్యాలయాలన్నీ ఉద్యోగులు లేక వెలవెలబోయాయి. ఆయా కార్యాలయాల్లోని ఏపీ విభాగాలకు తాళాలు దర్శనమివ్వగా, ఆయా కార్యాలయాల ప్రాంగణాల్లో పార్కింగ్ ప్లేస్ లు కూడా వాహనాలు లేక బోసిపోయాయి.