: భావోద్వేగాలను రెచ్చగొట్టే వారిని హీరోలు చేయొద్దు: మీడియాను కోరిన మోదీ
ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునే వారిని హీరోలుగా చేయవద్దని ప్రధాని నరేంద్రమోదీ మీడియాను కోరారు. నిన్న ఒక ప్రైవేటు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పలు విషయాలపై కుండ బద్దలు కొట్టారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అభివృద్ధే తమ ప్రధాన అజెండా అని తేల్చి చెప్పారు. అలాగే సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్న పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి మోదీ చురకలంటించారు. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రచార అర్భాటాల కోసం అటువంటి వ్యక్తులు అర్రులు చాస్తుంటారని పరోక్షంగా సుబ్రహ్మణ్యస్వామిని ఉద్దేశించి పేర్కొన్నారు. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలో తమకు తెలుసని ప్రధాని వ్యాఖ్యానించారు.