: సల్లూ భాయ్ పై రేప్ బాధితురాలి న్యాయపోరాటం!... రూ.10 కోట్ల పరిహారానికి దావా!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను వివాదాలు వీడటం లేదు. సుల్తాన్ సినిమా షూటింగులో స్టంట్స్ చేసేటప్పుడు అత్యాచారానికి గురైన మహిళ తరహాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ అతడు మొన్నీమధ్య చేసిన వ్యాఖ్యలు పెను కలకలాన్నే రేపాయి. సల్మాన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటులతో పాటు పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా హర్యానాలోని హిసార్ కు చెందిన ఓ రేప్ బాధితురాలు ఏకంగా కోర్టుకు ఎక్కింది. బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసి, తమను గాయపరచిన సల్మాన్ నుంచి రూ.10 కోట్ల మేర పరిహారం ఇప్పించాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాలుగేళ్ల క్రితం పది మంది చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన సదరు యువతి ప్రస్తుతం ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆమె తండ్రి నాడే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులుండగా వారిలో నలుగురికి జీవిత ఖైదు పడింది. అయితే వారికి ఉరి శిక్ష వేయాలని ఆమె ప్రస్తుతం హర్యానా, పంజాబ్ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో గత వారం సల్మాన్ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆమెను మరింత గాయపరిచాయి. దీంతో ఆమె హిసార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేప్ బాధితుల మనసు గాయపడేలా వ్యాఖ్యలు చేసిన సల్మాన్ నుంచి రూ.10 కోట్ల పరిహారం ఇప్పించాలని ఆమె తన పిటిషన్ లో డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు శనివారమే సల్మాన్ కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఇంటి అడ్రెస్ కు నోటీసులు జారీ అయ్యాయి.