: రైల్వేలో ‘మూడో నేత్రం’.. ప్రమాదాల నివారణే లక్ష్యం.. ప్రపంచంలోనే మొదటిది!
లేజర్ బేస్‌డ్ టెర్రైన్ ఇమేజింగ్ విజన్ సిస్టం ఉపయోగించే మొట్టమొదటి దేశంగా భారత్ రికార్డులకెక్కబోతోంది. రైల్వే ట్రాక్‌లపై జరుగుతున్న ప్రమాదాలను గుర్తించి అరికట్టేందుకు రైల్వే శాఖ ‘త్రినేత్ర’గా పిలిచే ఈ విధానాన్ని త్వరలో ఉపయోగించబోతోంది. ఈ విధానం ద్వారా ట్రాక్‌లపై జరిగే కార్యక్రమాలను రికార్డు చేసే వీలుండడంతో తర్వాత వీటిని విశ్లేషించే అవకాశం చిక్కుతుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్ఎస్ఆర్‌బీ) ప్రకారం 2014లో 27వేల మంది రైలు ప్రమాదాల కారణంగా మరణించారు. వీటిలో చాలావరకు రైలు నుంచి పడిపోవడం, ఆత్మహత్యలు తదితర ఘటనలు ఉన్నాయి. వీటిని నివారించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ‘త్రినేత్ర’ను ఉపయోగించాలని భావిస్తోంది. లోకోమోటివ్‌ల కోసం ‘త్రినేత్ర’ను డిజైన్ చేయడంతోపాటు అభివృద్ధి చేసి అమలు చేసేందుకు రైల్వేశాఖ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. రైల్వే బోర్డు మెకానికల్ మెంబర్ హేమంత్ కుమార్ ఆలోచన ఇది. ‘త్రినేత్ర’ను డిజైన్ చేసేందుకు ఇజ్రాయిల్ నుంచి రెండు కంపెనీలు, యూకే నుంచి ఒకటి ముందుకొచ్చాయి. ఈ విధానం ద్వారా లోకో పైలట్(డ్రైవర్) కిలోమీటర్ మేర ట్రాక్‌పై ఏం జరుగుతుంతో డిస్‌ప్లే ప్యానల్‌లో చూడవచ్చు. ఇన్‌ఫ్రారెడ్, లేజర్ టెక్నాలజీని ప్రపంచంలోని ఏ రైల్వే కూడా ఇప్పటి వరకు వినియోగించలేదు. ఈ సాంకేతికతను కేవలం యుద్ధాల్లోనే ఉపయోగించడం గమనార్హం.