: సౌదీలో చిక్కుకుపోయిన 200 మంది హైదరాబాదీయులు.. రక్షించాలని వేడుకోలు


పొట్టకూటి కోసం సౌదీ వలస వెళ్లిన దాదాపు 4,500 మంది భారతీయులు కంపెనీ నిర్వాకంతో అక్కడ చిక్కుకుపోయారు. వీరిలో 200 మంది హైదరాబాదీయులు ఉన్నారు. వీరంతా సౌదీ బిన్‌లాడెన్ గ్రూప్(ఎస్‌బీజీ) అనే నిర్మాణ కంపెనీలో పనిచేస్తున్నారు. గత ఆరు నెలలుగా కంపెనీ వేతనాలను చెల్లించకపోవడంతో తిండీతిప్పలు లేక, స్వదేశం తిరిగి రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో ఎక్కువశాతం మంది ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు ఉన్నారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, భారత విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను తిరిగి స్వదేశం చేర్చాలని బాధితులు అభ్యర్థిస్తున్నారు. ఆరు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని, అడిగితే పోలీసులతో కొట్టిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్బీజీ గ్రూపు నిర్మించిన బ్రిడ్జి కూలిపోవడంతో ఆ కంపెనీ కాంట్రాక్టును ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో చాలామంది కార్మికులను కంపెనీ పనినుంచి తీసేసింది. అంతేకాక వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి పాస్‌పోర్టులు లేబర్ కాంట్రాక్టర్ల వద్ద ఉండిపోవడంతో స్వదేశం రాలేక అక్కడే ఉండలేక సతమతమవుతున్నారు. దాదాపు 200 మంది హైదరాబాదీయులు ఇక్కడ చిక్కుకుపోయారని, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఈ విషయంలో చొరవ తీసుకుని తమను రక్షించాలని హైదరాబాద్ కార్మికులు వేడుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు విదేశాంగ శాఖ స్పందించలేదు.

  • Loading...

More Telugu News