: రెండో రోజుకు రేవంత్ దీక్ష... భారీగా తరలివస్తున్న ప్రజలు
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో నష్టపోతున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, టీటీడీపీ వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏటిగడ్డ కిష్టాపూర్ లో చేస్తున్న నిరాహార దీక్ష నేడు రెండవ రోజుకు ప్రవేశించింది. రేవంత్ దీక్షకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. వందల సంఖ్యలో నిర్వాసితులు రేవంత్ రెడ్డి దీక్ష చేస్తున్న ప్రాంతానికి వస్తుండటంతో, ఇక్కడ సందడి నెలకొంది. గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు బెదిరిస్తున్నట్టు పలువురు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదంటూనే, సరైన పరిహారం ఇచ్చిన తరువాతనే ముందడుగు వేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. కాగా, నేడు సాయంత్రం 5 గంటలకు రేవంత్ రెడ్డి తన దీక్షను విరమించనున్నారు.