: ఖైదీతో కలిసి పోలీసుల ‘మందు’ భోజనం!... నాసిక్ లో ఊడిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఉద్యోగాలు
మహారాష్ట్రలోని నాసిక్ లో సెంట్రల్ జైల్లో వార్డర్లుగా పనిచేస్తున్న ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్ల ఉద్యోగాలు ఊడిపోయాయి. ఎందుకు అనుకుంటున్నారా? కోర్టు విచారణకు తీసుకెళ్లిన ఖైదీతో కలిసి వారు విందు చేసుకున్నారు. విందుకు మాత్రమే వారు పరిమితం కాలేదు. ఫుల్లుగా మందు కొట్టారు. ఆ తర్వాత కరుడుగట్టిన నేరస్తుడైన ఆ ఖైదీతో కలిసి వారంతా మరో పేరు మోసిన క్రిమినల్ తో భేటీ అయ్యారట. వివరాల్లోకెళితే... గత నెలలో సమీర్ పఠాన్ అనే ఖైదీని విచారణ నిమిత్తం వార్డర్లు ప్రమోద్ జాదవ్, సాగర్ బోధ్లే, రాహుల్ దోంగ్డేలు నగరంలోని ఓ కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు విచారణ ముగిసిన వెంటనే తిరిగి జైలుకు బయలుదేరాల్సిన వారు... పోలీస్ వ్యాన్ ను కోర్టు ఆవరణలోనే వదిలేసి ప్రైవేట్ వాహనంలో త్రయంబకేశ్వర్ రోడ్డు వైపుగా వెళ్లారు. అక్కడ మందు పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత పేరు మోసిన నేరస్తుడు గణేశ్ సురేశ్ వా ను కలిశారు. ఇక తమ తంతు మొత్తాన్ని ముగించుకున్న తర్వాత రాత్రి 7 గంటలకు జైలుకు వచ్చారు. లేటెందుకైందన్న ప్రశ్నకు... వ్యాన్ చెడిపోయిందని, బాగు చేసుకుని వచ్చేలోగా ఆలస్యమైందని చెప్పారు. దీనిపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అసలు విషయాన్ని నిగ్గు తేల్చారు. ముగ్గురు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించేశారు.