: ప్రెస్ మీట్ లో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్!... మీడియాతో మాట్లాడుతుండగానే లాక్కెళ్లిన ఢిల్లీ పోలీసులు!


దేశ రాజధానిలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఓ ఘటన కలకలం రేపుతోంది. ఢిల్లీలో అధికార పార్టీ ఆప్ కు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండగానే పోలీసులు ఆయనను లాక్కెళ్లారు. వివరాల్లోకెళితే... గడచిన ఎన్నికల్లో ఆప్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన దినేశ్ మోహనియా... ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో నీటి కొరతపై వినతి ఇచ్చేందుకు నిన్న తన కార్యాలయానికి వచ్చిన ఓ వృద్ధుడితో పాటు పలువురు మహిళల పట్ల దినేశ్ దురుసుగా వ్యవహరించారు. సమస్యలను విన్నవించేందుకు వచ్చిన వారిని దినేశ్ తోసేయడమే కాకుండా వారిపై తిట్ల దండకం అందుకున్నారు. దీంతో షాక్ తిన్న బాధితులు నెబ్ సరాయ్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నేటి ఉదయం దినేశ్ ను అరెస్ట్ చేసేందుకు బయలుదేరారు. దినేశ్ కార్యాలయం వద్దకు పోలీసులు చేరుకునే సరికి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. అయినా ఏమాత్రం ఆగకుండా పోలీసులు మీడియా సమావేశంలోకి చొచ్చుకువెళ్లారు. మీడియాతో మాట్లాడటం పూర్తి కాకముందే దినేశ్ ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తమ వెంట తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News