: ‘హీరో’ ప్లాంటును ఎత్తుకెళ్లిన ఏపీ!


రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణల మధ్య అన్ని అంశాల్లోనూ పోటీ నెలకొంది. ప్రభుత్వ సంస్థల పంపిణీ, నీటి వాటాలపైనే కాక పారిశ్రామిక సంస్థల ఆకర్షణలోనూ ఈ రెండు రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. ఈ పోటీలో ఓ సారి తెలంగాణాది పైచేయిగా నిలిస్తే... మరోమారు ఏపీ విజయం సాధిస్తోంది. తాజాగా ‘హీరో మోటో కార్ప్’ కొత్తగా ఏర్పాటు చేయనున్న మోటార్ సైకిళ్ల ప్లాంటును చేజిక్కించుకోవడంలో తెలంగాణపై ఏపీ పైచేయి సాధించింది. తెలుగు నేలపై ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిన ‘హీరో మోటో కార్ప్’ యాజమాన్యం ముంజాల్ గ్రూప్ తొలుత తెలంగాణ సర్కారును సంప్రదించింది. ఈ క్రమంలో ఆ సంస్థకు రెడ్ కార్పెట్ పరచిన తెలంగాణ సర్కారు హైదరాబాదు సమీపంలోని మెదక్ జిల్లాలో స్థలం కేటాయింపునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే రాయితీల విషయంలో తెలంగాణ సర్కారు నోరు విప్పలేదన్న ఆరోపణలు నాడు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఏపీ సర్కారు భూమితో పాటు రాయితీలు కూడా ఇస్తామని హీరో మోటో కార్ప్ కు సమాచారం పంపింది. అందుకు ఆసక్తి చూపిన ఆ సంస్థ ఏపీవైపు మొగ్గు చూపింది. ఈ క్రమంలో ఏమాత్రం ఆలస్యం చేసినా హీరో ప్లాంటు ఎక్కడ చేజారుతుందోనన్న భయంతో ఏపీ సర్కారు వడివడిగా అడుగులు వేసింది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో అందుబాటులో ఉన్న భూమిని ఆ సంస్థ ప్రతినిధులకు చూపింది. సదరు భూమికి ‘హీరో’ ఓకే అనగానే... అక్కడ 600 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయిస్తూ నిన్నటి కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న మరుక్షణమే ఏపీ మౌలిక వసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ భూ బదలాయింపు విషయంలో చర్యలకు ఉపక్రమించారు. ‘హీరో’కు కేటాయించాల్సిన భూమికి సంబంధించిన ఒప్పంద పత్రాలను త్వరితగతిన సిద్ధం చేయాలని ఆయన ఏపీఐఐసీకి ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ఈ ఒప్పందం పూర్తి కాగానే, ‘హీరో’ తన ప్లాంటు నిర్మాణాన్ని చేపట్టనుంది.

  • Loading...

More Telugu News