: ఇక టెలికాం సర్కిళ్లు కూడా రెండు!... అయినా తెలుగు రాష్ట్రాల మధ్య నో రోమింగ్!
తెలుగు నేల రెండేళ్ల క్రితం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో అప్పటిదాకా ఉమ్మడి రాష్ట్రం కింద ఉన్న ప్రభుత్వ శాఖలన్నీ రెండుగా విడిపోక తప్పలేదు. ఈ నెల 27 నాటికి ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు సహా, అన్ని కమిషనరేట్లు కూడా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిసరాలకు తరలిపోతున్నాయి. ఇప్పటికే చాలా శాఖలు అమరావతికి వెళ్లిపోగా, ఈ నెల 27న ఏపీ సీఎస్ ఎస్పీ టక్కర్ కూడా అమరావతికి తన కార్యాలయాన్ని మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం సర్కిల్ కూడా రెండుగా విడిపోనుంది. రాష్ట్రం రెండుగా విడిపోయినా... రెండేళ్లుగా టెలికాం సర్కిల్ మాత్రం ఒక్కటిగానే కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే వచ్చే నెల 1 నుంచి టెలికాం సర్కిల్ రెండుగా విడిపోనుంది. ఈ మేరకు టెలికాం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ‘ఉమ్మడి’గా ఉన్న టెలికాం సర్కిల్ లో 19 వేల నాన్ ఎగ్జిక్యూటివ్ సిబ్బంది, 6 వేల దాకా ఎగ్జిక్యూటివ్ సిబ్బంది పనిచేస్తున్నారు. టెలికాం సర్కిల్ రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణ టెలికాం సర్కిల్ హైదరాబాదులోనే కొనసాగనుండగా, ఏపీ టెలికాం సర్కిల్ మాత్రం కొత్తగా విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగించనుంది. విభజన జరిగిన తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ సిబ్బంది... ఏ జిల్లాలో పనిచేస్తున్న వారు ఆ జిల్లాలోనే ఉండిపోతారు. ఎగ్జిక్యూటివ్ సిబ్బందిని మాత్రం వారు ఇచ్చే ‘ఆప్షన్’ల ఆధారంగా ఇరు రాష్ట్రాలకు పంపిణీ అవుతారు. ఇక టెలికాం సర్కిల్ రెండుగా విడిపోయినా... వీటి మధ్య రోమింగ్ మాత్రం ఉండదని ఆ శాఖ ప్రకటించింది.