: కేసీఆర్ పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్య!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై నిన్న ఘాటు వ్యాఖ్య చేశారు. నిన్నటి విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించేందుకు స్వయంగా చంద్రబాబే మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్ స్థలాన్ని తమకే ఇవ్వాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేసిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు... కేసీఆర్ అన్నింటికీ ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘మనకన్నీ ఇబ్బందులే. ఓ పక్క ఆయన (కేసీఆర్) ఇబ్బంది పెడతాడు. కేంద్రం నుంచి ఇంకా నిధులు రాలేదు. అయినప్పటికీ మనం ముందుకెళ్లాలి. తెలివే మన ధైర్యం. దృఢ సంకల్పంతో ముందుకెళ్లాల్సి ఉంది. 4 శాతం జనాభా ఉన్న ఏపీ... జేఈఈలో 15 ర్యాంకులు దక్కించుకోవడం మన సత్తాకు నిదర్శనం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.