: సునీల్ చూపించే ఆప్యాయతను చూసి ‘నో’ చెప్పలేకపోయాను: మెగాస్టార్ చిరంజీవి


‘సునీల్ చూపించే ఆప్యాయతను చూసి ఈ కార్యక్రమానికి నేను రాలేను అని చెప్పలేకపోయాను’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘జక్కన్న’ ఆడియో సీడీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ, "మూడు రోజుల క్రితం సునీల్ నాకు ఫోన్ చేసి ఈ ఆడియో కార్యక్రమానికి రావాలన్నాడు. నా 150 వ చిత్రం షూటింగ్ ప్రారంభమవడం, నైట్ షూటింగ్ కూడా ఉండటంతో నేను రాలేనని, ఈ కార్యక్రమాన్ని దాటవేద్దామని అనుకున్నాను. కానీ, సునీల్ చూపించే ఆప్యాయతను చూసి ‘నో’ చెప్పలేకపోయాను. స్టేజ్ లపై నా డ్యాన్స్ లు చేసి ఈ రోజు ఈ స్థాయికి వచ్చానని సునీల్ ఎప్పుడూ చెబుతుంటాడు. చాలా సంతోషం. ఎందుకంటే, ఒక అభిమాని అభివృద్ధిలోకి రావడాన్ని చూసి గర్వించేది తల్లిదండ్రులు. ఆ తర్వాత గర్వించేది నేనే. నన్ను అభిమానించే అభిమానులు కూడా అభివృద్ధిలోకి రావాలి. అప్పుడే నన్ను ప్రేమించే అభిమానులను చూసి గర్వపడుతుంటాను. అటువంటి స్థాయి ప్రతి అభిమానికి రావాలని కోరుకుంటాను. అటువంటి అభిమానుల్లో నంబర్ వన్ గా ఉన్నటువంటి సునీల్ ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరైనా సినిమాల్లోకి రావాలి, రాణించాలి అనుకుంటే.. కష్టాన్ని నమ్ముకుంటే కచ్చితంగా వస్తారని చెప్పడానికి పెద్ద ఎగ్జాంపుల్ సునీల్ కంటే ఎవరూ ఉండరనుకుంటున్నాను. సునీల్ ను చూస్తుంటే నాకే ఆశ్చర్యమేస్తోంది. పుష్టిగా ఉండే సునీల్... బాడీ బిల్డర్ లాగా, కండల వీరుడిలాగా మారాడు. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అయిన సునీల్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ‘జక్కన్న’ క్లిప్పింగ్స్ లో సునీల్ డ్యాన్స్ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మనకున్న బెస్ట్ డ్యాన్సర్లలో సునీల్ ఒకడని చాలా గర్వంగా చెప్పగలం. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత వస్తున్న సునీల్ కు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అన్నారు చిరంజీవి.

  • Loading...

More Telugu News