: ఇష్టమొచ్చినట్లు వార్తలు రాస్తున్నారు: చంద్రబాబు ఆగ్రహం
రాజధాని భూములు, సచివాలయ తరలింపు అంశంపై మీడియాలో ఇష్టమొచ్చినట్లు వార్తలు రాస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇష్టం వచ్చినట్లు వార్తలు రాసే పద్ధతి మంచిది కాదని అన్నారు. ‘సచివాలయం కుంగిపోయిందని దుర్మార్గంగా రాశారు’ అని ఆయన మండిపడ్డారు. వార్తలు రాసేవారు సంయమనం పాటించాలని, వాస్తవాలు రాయాలని ఆయన అన్నారు. రాజధానిలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందంటూ రాశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కోట్ల అవినీతి జరిగే అవకాశం, ఆస్కారం అక్కడ ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి వార్తలు రాస్తే ఇక్కడికి వచ్చే సంస్థల్లో, భూములిచ్చిన ప్రజల్లో అభద్రతా భావం కలుగుతుందని ఆయన అన్నారు. అటువంటి నేరాన్ని చేయొద్దని ఆయన హెచ్చరించారు.