: బ్రెగ్జిట్ ముగిసింది... ఇక డ్రెగ్జిట్, ఇగ్జిట్ : నైజిల్ పరాగే
బ్రిటన్ ప్రజల చారిత్రాత్మక విజయం యూరోపియన్ యూనియన్ స్వరూపాన్నే మార్చేయనుందని బ్రిటన్ నేత, నైజిల్ పరాగే వ్యాఖ్యానించారు. బ్రిటన్ వాసుల మాదిరిగానే కూటమిలోని పలు దేశాల ప్రజలు వైదొలగాలని భావిస్తున్నారని, వారంతా ఇక ఉద్యమిస్తారని అన్నారు. తమ వెంట నడిచే తొలి దేశంగా డెన్మార్క్ నిలుస్తుందని, ఇక అక్కడ 'డ్రెగ్జిట్' (డెన్మార్క్ ఎగ్జిట్) ప్రచారం ఊపందుకుంటుందని, దాని వెనుకే ఇగ్జిట్ (ఇటలీ ఎగ్జిట్) తెరపైకి వస్తుందని అన్నారు. వీటితో పాటు స్వీడన్, ఆస్ట్రియాలు సైతం కూటమిని వీడుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయూ ఇక మరణశయ్య మీదకు చేరినట్టేనని అన్నారు. ఇకపై కూడా యూరప్ దేశాలన్నీ కలిసి వ్యాపారం చేసుకోవచ్చని, అభివృద్ధి దిశగా ఒకరి కొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగవచ్చని అన్నారు. ఇరుగుపొరుగు దేశాలుగా, స్నేహితులుగా కలిసే వుందామని అన్నారు. ఇక ప్రజల ఆకాంక్ష మేరకు ఈయూ నుంచి బయటకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా వారు అడుగులు వేయకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రజల నుంచి చారిత్రాత్మక తీర్పును అందుకున్న జూన్ 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని నైజిల్ పరాగే డిమాండ్ చేశారు.