: కమలం గూటికి టీఆర్ఎస్ మంత్రులు!... ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యల కలకలం!
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కొద్దిసేపటి క్రితం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు విపక్షాలు విలవిల్లాడుతున్నాయి. అయితే తెలంగాణలో విపక్షంగా ఉన్న బీజేపీకి మాత్రం ఈ ప్రభావం దరి చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎన్వీఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు, కేసీఆర్ సర్కారులో కొనసాగుతున్న కొందరు కీలక మంత్రులు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారని ఎన్వీఎస్ఎస్ ప్రకటించారు. అయితే పార్టీ మారుతున్న టీఆర్ఎస్ మంత్రుల పేర్లను ఇప్పుడే వెల్లడించలేనని చెప్పిన ఎన్వీఎస్ఎస్... సమయమొచ్చినప్పుడు బయటపెడతానని చెప్పారు.