: గూగుల్ సెర్చిలో తండ్రిని దాటేసిన కేటీఆర్!... ‘రాయలసీమ స్ట్రాంగ్ మ్యాన్’ జగన్ కు తగ్గుతున్న ఆదరణ!
తెలుగు రాష్ట్రాల్లో కీలక రాజకీయవేత్తలుగా ఉన్న నేతలకు సంబంధించి ‘గూగుల్ సెర్చి’లో నెటిజన్ల ప్రాధమ్యాలు వేగంగా మారిపోతున్నాయి. తెలంగాణ యాసకు, భాషకు మునుపెన్నడూ లేనంత గుర్తింపు తెచ్చిన నేతగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొన్నటిదాకా గూగుల్ సెర్చిలో అందరికంటే ముందున్నారు. అయితే ఆయన కుమారుడి హోదాలో రాజకీయ తెరంగేట్రం చేసి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల తారకరామారావు క్రమంగా ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన నాటి నుంచి నెటిజన్లు కేసీఆర్ కంటే కేటీఆర్ పేరునే ఎక్కువగా సెర్చి చేస్తున్నారు. ఇక ఏపీ విషయానికొస్తే... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి కంటే కాస్తంత మెరుగైన పరిస్థితిలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... 2014 ఎన్నికల తర్వాత క్రమంగా ప్రాభవం కోల్పోతున్నారు. గూగుల్ సెర్చిలో ‘రాయలసీమ స్ట్రాంగ్ మ్యాన్’ గా పేరొందిన జగన్... ప్రస్తుతం చంద్రబాబు కంటే బాగా వెనుకబడ్డారట. స్వల్ప వ్యవధిలోనే నవ్యాంధ్ర నూతన రాజధానికి శంకుస్థాపన చేయగలిగిన చంద్రబాబును సెర్చి చేస్తున్న నెటిజన్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.