: ఙ్ఞానసాయి దీనస్థితిపై స్పందించిన చంద్రబాబు!... వైద్య ఖర్చులను సీఎంఆర్ఎఫ్ నుంచి విడుదల చేస్తామని ప్రకటన
చిత్తూరు జిల్లా ములకల చెరువు మండలానికి చెందిన 9 నెలల చిన్నారి ఙ్ఞానసాయి దీనస్థితిపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వేగంగా స్పందించారు. ఓ వైపు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమైన ఆ చిన్నారికి సంబంధించి సాయం కోసం ఓ తెలుగు టీవీ ఛానెల్ నేటి ఉదయం లైవ్ షో నిర్వహిస్తున్న సమయంలోనే ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ఫోన్ చేసి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడిన కామినేని... పాపను బ్రతికించేందుకు మానవ యత్నాలన్నీ చేస్తామని ప్రకటించారు. కామినేని ప్రకటన తర్వాత చంద్రబాబు కూడా దీనిపై స్పందించారు. పాపకు చేయాల్సిన వైద్య చికిత్సలకు సంబంధించిన మొత్తం వ్యయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేస్తామని చెప్పారు. ఈ మేరకు కామినేనికి ఫోన్ చేసిన చంద్రబాబు... పాప చికిత్స కోసం ప్రపంచంలోని మేటి వైద్యులను సంప్రదించాలని, తక్షణమే చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.