: 91 ఏళ్ల వ్యక్తి చివరి కోరికకు సరేనన్న పాకిస్థాన్.. వీసా మంజూరు!


పండుముదుసలి చివరి కోరికను తీర్చేందుకు పాకిస్థాన్ ముందుకొచ్చింది. పాకిస్థాన్‌లో తాను పుట్టి పెరిగిన ఊరును చూడాలని ఉందన్న ఆ వృద్ధుడి కోరికను మన్నించి దశాబ్దకాలంగా తిరస్కరిస్తూ వస్తున్న వీసా దరఖాస్తును ఎట్టకేలకు అంగీకరించింది. కృష్ణ ఖన్నా(91), తనకు ఐదేళ్ల వయసప్పుడు 1930 ప్రాంతంలో పాకిస్థాన్‌లోని ఉధోక్‌లో తన తాతగారితో కలసి ఉన్నప్పటి బాల్యస్మృతులు ఇంకా గుర్తున్నాయి. 1947 అల్లర్ల సమయంలో ఆ గ్రామంలో ఉండడం క్షేమం కాదని భావించిన కుటుంబ సభ్యులు ఉధోక్ నుంచి షేక్‌పురాకు వచ్చి ఓ గురుద్వారాలో తలదాచుకున్నారు. అక్కడ వారిని చుట్టుముట్టిన దుండగులు చంపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆర్మీ రావడంతో పారిపోయారు. అలా వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత మీరట్‌ కు వచ్చి ఖన్నా కుటుంబం స్థిరపడింది. అక్కడ ఆయన క్రికెట్ వస్తువులు అమ్మే షాప్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కృష్ణ‌కు 91 సంవత్సరాలు. పుట్టిన ఊరిపై మమకారాన్ని చంపుకోలేని ఆయన తాను ఆడిపాడిన పాకిస్థాన్‌లోని ఉధోక్‌, షేక్‌పురాను చూడాలనుకున్నారు. అదే తన చివరి కోరికగా కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో గత పదేళ్లుగా పాకిస్థాన్ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నా తిరస్కరణకు గురవుతూనే ఉంది. ఏప్రిల్ 26న కృష్ణ చివరి కోరికపై ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో స్పందించిన పాక్ ఎంబసీ అధికారులు కృష్ణకు గురువారం వీసా మంజూరు చేశారు. అంతేకాదు, అతనికి తోడుగా మరో ముగ్గురికి అనుమతిచ్చింది. ఆ ముగ్గురిలో కృష్ణ 80 ఏళ్ల సోదరుడు జగదీష్ కూడా ఉన్నారు. పాక్ వీసా మంజూరు చేసిన విషయం తెలుసుకున్న కృష్ణ కళ్ల నుంచి ఆనందంతో కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ‘‘నేను చాలాసార్లు పాక్ వీసా కోసం ప్రయత్నించా. లోకల్ స్పాన్సర్ అవసరమని చెప్పారు. కానీ నాకు అక్కడ తెలిసినవారెవరూ లేకపోవడంతో నా కల ఇన్నాళ్లూ నెరవేరలేదు’’ అని అన్నారు కృష్ణ ఖన్నా. త్వరలోనే తన జన్మస్థలానికి వెళ్లడానికి ఆయన సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News