: కోడలిని హత్య చేసేందుకు ఎనిమిదేళ్లు పగతో వేచి చూసిన అత్తమామలు!
కొడుకు కులాంతర వివాహం చేసుకుని ఇంటి పరువు తీశాడన్న భావనతో, ఎనిమిది సంవత్సరాల పాటు పగను కడుపులో దాచుకుని అదను కోసం వేచి చూసిన అతని తల్లిదండ్రులు, తమ పగను కోడలిపై తీర్చుకున్నారు. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఈ ఘటన తమిళనాడులో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఎనిమిదేళ్ల క్రితం పీజీ చదువుకుంటున్న సమయంలో సంతోష్, సుమతిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి కులాలూ వేర్వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఎవరూ ఒప్పుకోలేదు. వీరిని ఎదిరించి వివాహం చేసుకున్న జంట, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కాపురం చేసుకుంటూ ఉంది. ఈలోగా తమ మనసు మారిందని చెబుతూ, సంతోష్ తల్లిదండ్రులు సుమతిని తమ ఇంటికి ఆహ్వానించారు. వారిని నమ్మి ఆమె ఇంటికి వచ్చింది. అంతా బాగుందని భావిస్తున్న వేళ, ఒకరోజు సుమతి ఇంట్లో దారుణంగా హత్య చేయబడింది. తర్వాత దొంగలు వచ్చి, తమ కోడలిని హత్య చేసి నగలు ఎత్తుకు వెళ్లారని అత్తమామలు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులకు వారి వైఖరిపై అనుమానం రావడంతో తమదైన శైలిలో ప్రశ్నించే సరికి అసలు విషయం తెలిసింది. ఎనిమిదేళ్ల పాటు పగను పెంచుకున్న వారే స్వయంగా కోడలిపై దాడి చేసి గొంతు కోసి చంపడంతో పాటు నగదు, నగలు దాచినట్టు తెలుసుకుని పోలీసులే విస్తుపోయారు. దీంతో వారిని అరెస్ట్ చేసి పరువు హత్య కింద కేసు పెట్టి రిమాండ్ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.