: ఆదాయమే పరమావధి అంటూ... చరిత్రలో తొలిసారిగా రంజాన్ నిబంధనలను పక్కన పెట్టిన దుబాయ్!
సనాతన ముస్లిం సంప్రదాయాలను కఠినంగా అమలు చేసే దుబాయ్, తొలిసారిగా రంజాన్ నిబంధనలను సరళీకరించింది. టూరిస్టుల నుంచి వచ్చే ఆదాయం, ఆల్కహాల్ పన్ను రూపంలో వచ్చే డబ్బును వదులుకోలేని దుబాయ్, రంజాన్ సమయంలో అమలయ్యే మద్య నిషేధాన్ని తొలగించింది. దుబాయ్ చరిత్రలో రంజాన్ సందర్భంగా పగటిపూట మద్యాన్ని అమ్ముకోవచ్చని ఆదేశాలు జారీ కావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ విదేశీయులైనా, స్వదేశీయులైనా రంజాన్ సమయంలో దుబాయ్ లో చేతిలోకి బీరు గ్లాస్ తీసుకోవాలంటే, సూర్యుడు పడమటి పొద్దుకు వాలేంత వరకూ ఆగాల్సిందే. ఇక ఈ సంవత్సరం దుబాయ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ టూరిజం అండ్ కామర్స్ నుంచి ఎమిరేట్స్ లోని అన్ని బార్లు, నైట్ క్లబ్బులకు, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకూ మద్యం అమ్మకాలను అనుమతిస్తున్నట్టు సర్క్యులర్ పంపింది. తమ దేశానికి వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా, వారు కోరుకునే అనుభూతిని అందించేందుకే ఈ నిబంధనల మార్పు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఏ సమయంలోనైనా టూరిస్టులు వచ్చే వరల్డ్ క్లాస్ డెస్టినేషన్ గా దుబాయ్ ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించింది. కాగా, ఈ రంజాన్ సీజనులో షాపింగ్ నిమిత్తం 10 లక్షల మంది వరకూ దుబాయ్ వస్తారని అంచనా. అయితే, ఇక్కడికి వచ్చే అతిథులు అరబ్ సంస్కృతి, సంప్రదాయాలను మనసులో పెట్టుకుని మెలగాలని ప్రభుత్వం సూచించింది. దుబాయ్ లో మద్యంపై 30 శాతం మునిసిపల్ టాక్స్, 50 శాతం దిగుమతి పన్ను అమలవుతూ ఉంటుంది. దీంతో మామూలుగానే అక్కడ మద్యం ఖరీదు చాలా ఎక్కువ. ప్రభుత్వ ఖజానాకూ భారీగా ఆదాయం సమకూరుతుంది. అందువల్లే దుబాయ్ పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.