: చక్రం తిప్పిన కోహ్లీ, గంగూలీ!... టీమిండియా హెడ్ కోచ్ గా అనిల్ కుంబ్లే!
టీమిండియా హెడ్ కోచ్ గా స్వదేశీ దిగ్గజానికే బీసీసీఐ జైకొట్టింది. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేను టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపిక చేస్తూ బీసీసీఐ కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. డంకన్ ఫ్లెచర్ పదవీ విరమణ తర్వాత దాదాపుగా రెండేళ్లుగా కోచ్ లేకుండానే టీమిండియా కొనసాగింది. అయితే మాజీ బ్యాట్స్ మన్ రవిశాస్త్రి డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టి కోచ్ లేని లోటు తీర్చారు. అయితే ఎన్నాళ్లని తాత్కాలిక ఏర్పాట్లతో ముందుకెళతామన్న బీసీసీఐ... కోచ్ ఎంపికకు ఇటీవల చర్యలు చేపట్టింది. ఈ పదవికి 57 దరఖాస్తులు దాఖలు కాగా... వాటిలో మాజీ డైరెక్టర్ రవిశాస్త్రితో పాటు అనిల్ కుంబ్లే, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాద్ తదదతరులతో పాటు పలువురు విదేశీ దిగ్గజాల దరఖాస్తులు కూడా ఉన్నాయి. అయితే మొత్తం దరఖాస్తులను వడబోసి 20 మందితో ఓ జాబితాను రూపొందించిన బీసీసీఐ... వారిలో నుంచి హెడ్ కోచ్ ను ఎంపిక చేయాలని సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన త్రిసభ్య కమిటీకి సూచించింది. మూడు రోజులుగా పలువురిని ఇంటర్వ్యూ చేసిన ఈ కమిటీ తన నివేదికను బీసీసీఐకి రెండు రోజుల క్రితమే అందజేసింది. నివేదికను పరిశీలించిన బీసీసీఐ అనిల్ కుంబ్లేకు హెడ్ కోచ్ పదవి అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు నేటి సాయంత్రం ధర్మశాలలో భేటీ కానున్న బీసీసీఐ... కుంబ్లే నియామకాన్ని అధికారికంగా ప్రకటించనుంది. కుంబ్లేకు హెడ్ కోచ్ పదవి దక్కడంలో టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, త్రిసభ్య కమిటీలోని సౌరవ్ గంగూలీ కీలక భూమిక పోషించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.