: ఎమ్మెల్సీలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకట్లేదు!... ‘టీ మండలి’ చైర్మన్ కు పొంగులేటి ఫిర్యాదు


తనను కలిసేందుకు వస్తున్న వివిధ వర్గాలకు చెందిన వారికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకే కేసీఆర్ దర్శన భాగ్యం దక్కలేదన్న వార్తలూ వినిపించాయి. తాజాగా శాసన మండలి సభ్యులను కూడా కేసీఆర్ దగ్గరికి రానివ్వడం లేదట. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మండలి చైర్మన్ స్వామి గౌడ్ కు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లపై విజయం సాధించి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని స్వామి గౌడ్ కు అందజేసిన పొంగులేటి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వ్యవహార సరళిపై విరుచుకుపడ్డారు. శాసన మండలి సభ్యులన్న గౌరవం లేకుండా కేసీఆర్ ఎమ్మెల్సీలకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. పార్టీలు వేరైనా అధికారంలో ఉన్న సీఎంగా విపక్ష ఎమ్మెల్సీలకు కూడా అపాయింట్ మెంట్లు ఇచ్చి మండలి గౌరవాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఇదే విషయాన్ని చైర్మన్ స్వామి గౌడ్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News