: టెక్నాలజీపై ఉత్తర కొరియాకు భారత శిక్షణ... అల్ జజీరా సంచలన కథనం
ఉత్తర కొరియా విద్యార్థులకు భారత్ సాంకేతిక పాఠాలను చెబుతోందని, ఇరు దేశాల మధ్య మంచి స్నేహబంధం రహస్యంగా సాగుతోందని గ్లోబల్ మీడియా హౌస్, అరబ్ దేశాల్లో ప్రధాన మీడియా సంస్థ, ఉగ్రవాదుల వార్తలను ఎప్పటికప్పుడు బయటి ప్రపంచానికి తెలిపే 'అల్ జజీరా' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. డెహ్రాడూన్ లోని శిక్షణా కేంద్రంలో ఉత్తర కొరియా విద్యార్థులు హైటెక్ స్పేస్ టెక్నాలజీలపై పాఠాలు నేర్చుకుంటున్నారని పేర్కొంది. గతంలో ఇండియాలో పనిచేసిన నార్త్ కొరియా దౌత్యాధికారి హాంగ్ యాంగ్ ఇల్ ఈ విషయాన్ని వెల్లడించారని, చాలా ప్రశాంతంగా ఉండే డెహ్రాడూన్ లో ఎవరికీ అనుమానం కలగని రీతిలో తమ వారు పాఠాలు నేర్చుకున్నారని, ఇక్కడి ఉపాధ్యాయులు నైపుణ్యవంతులైన మంచివారని ఆయన చెప్పినట్టు అల్ జజీరా పేర్కొంది. 1995లో ఐక్యరాజస్యసమితి ఈ కేంద్రాన్ని ప్రారంభించగా, 1996 తొలి బ్యాచ్ లో హాంగ్ ఉన్నారని తెలిపింది. ఇప్పటివరకూ 30 మందిని ఉత్తర కొరియా పంపిందని, ఇప్పటికీ ఇద్దరు ఇండియాలో ఉన్నారని తెలిపింది. అణు ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియాకు సహకరిస్తుండటంపై, ఐక్యరాజ్యసమితి సలహా సంఘానికి ఇండియా వివరణ ఇచ్చుకుందని కూడా చెప్పింది. 'ఇండియాస్ ఎంబ్రాసింగ్ నార్త్ కొరియన్ కనెక్షన్' పేరిట ఈ కథనం రాగా, కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఏ ఉత్తర కొరియా విద్యార్థి కూడా అల్ జజీరా చెప్పినట్టు రహస్యంగా విద్యాభ్యాసం చేయలేదని స్పష్టం చేసింది.