: చేతులు మాత్రమే కలిశాయి!... వాదనలు కలవట్లేదు!: ఢిల్లీలో ఆసక్తికరంగా దేవినేని, హరీశ్ భేటీ
కృష్ణా నదీ జలాల పంపకంపై తెలుగు రాష్ట్రాల మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, తన్నీరు హరీశ్ రావుల మధ్య ఢిల్లీలో కొనసాగుతున్న వరుస భేటీలు ఫలితాలనిచ్చే దిశగా సాగడం లేదన్న వాదన వినిపిస్తోంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి సలహా మేరకు నిన్న రాత్రే ఢిల్లీలో భేటీ అయిన దేవినేని, హరీశ్ రావు తమ తమ వాదనలకే కట్టుబడినట్లు వ్యవహరించారు. తాజాగా నేటి ఉదయం కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారి అమర్ జిత్ సింగ్ సమక్షంలో మరోమారు దేవినేని, హరీశ్ భేటీ అయ్యారు. నీటి పారుదల శాఖ అధికారులను వెంటబెట్టుకుని భేటీకి వెళ్లిన మంత్రులిద్దరూ ముందుగా కరచాలనం చేసుకున్నారు. ఆ తర్వాత అమర్ జిత్ సింగ్ కు ఎదురుగా దేవినేని, హరీశ్ రావు ఓ పక్కగా కూర్చున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాల వేడిని తగ్గించేందుకు అమర్ జిత్ సింగ్ చేసిన యత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ముందుగా నోరు విప్పిన దేవినేని... కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మించతలపెట్టిన పాలమూరు-రంగారెడ్ది, డిండి ప్రాజెక్టుల వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పినట్లు సమాచారం. దేవినేని వాదనను సాంతం విన్న తర్వాత హరీశ్ రావు కూడా అందుకు తగ్గట్టుగానే తమ వాదనను కూడా వినిపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల చేతులు కలిసినా... ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు.