: ఐటీ శాఖలో అవినీతి జలగలు!... 9 మంది టాప్ బాసులపై సీబీఐ కేసులు!
ప్రభుత్వం కళ్లుగప్పి అక్రమ సంపాదన పోగేస్తున్న అక్రమార్కుల ముక్కు పిండి పన్ను వసూలు చేయాల్సిన ఆదాయపన్ను శాఖలోనే అతినీతి జలగలు ఉన్నాయి. నిన్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిర్వహించిన సోదాల్లో ఈ కఠోర సత్యం వెలుగు చూసింది. ఆదాయపన్ను శాఖకు చెందిన 9 మంది ఉన్నతాధికారుల అవినీతి మాయాజాలం గుట్టు రట్టు చేసిన సీబీఐ వారిపై ఏకంగా కేసులు నమోదు చేసింది. ట్రావెల్, హోటళ్లు, లగ్జరీ కార్లు, ఫ్లైట్ టికెట్ల వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలంగా వ్యవహరించేందుకు పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని వారిపై అభియోగాలు మోపింది. సీబీఐకి చిక్కిన వారిలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ ఎస్కే మిట్టల్, ఆ శాఖకు చెందిన బెంగళూరు అడిషనల్ కమిషనర్ టీఎన్ ప్రకాశ్, చెన్నై డిప్యూటీ కమిషనర్లు హరూన్ ప్రసాద్, మురళి మోహన్, చెన్నై ఆడిట్ విభాగంలో కమిషనర్ గా పనిచేస్తున్న విజయలక్ష్మీ, ముంబైలో పనిచేస్తున్న అడిషనల్ కమిషనర్ పాండ్యన్, ఐటీఏటీ (డీఆర్) ముంబై కమిషనర్ లక్ష్మీ వరప్రసాద్, సిస్టమ్స్ విభాగంలో ఘజియాబాదులో అడిషనల్ డీజీగా పనిచేస్తున్న విక్రమ్ గౌర్, ముంబై దర్యాప్తు విభాగానికి చెందిన అడిషనల్ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ సహా ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్ సంజయ్ భండారీలు ఉన్నారు. ఈ దాడుల్లో రూ.2.6 కోట్ల నగదుతో పాటు 4.25 కిలోల బంగారాన్ని ఓ అధికారి ఇంటి నుంచి సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.