: దాబాలో చంద్రబాబు!... ప్రకాశం జిల్లా నేతలతో కలిసి టీ సేవించిన వైనం!
ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఓ రోడ్ సైడ్ దాబా హోటల్ యాజమానిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడకు కారులో బయలుదేరిన చంద్రబాబు... మార్గమధ్యంలో మద్దిపాడు మండలం గుళ్లపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న ఓ దాబా హోటల్ వద్ద ఆగారు. పార్టీ నేతలతో కలిసి దాబాలోకి వెళ్లిన చంద్రబాబు అక్కడి ఓ టేబుల్ ముందు కూర్చున్నారు. తన దాబాలోకి చంద్రబాబు ఎంటర్ కావడంతో సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయిన హోటల్ యజమాని చంద్రబాబు అండ్ కోకు తేనీరును అందజేశారు. పార్టీ నేతలతో కబుర్లు చెబుతూ చంద్రబాబు తేనీరు సేవించారు. అక్కడ రౌండ్ టేబుల్ ముందు చంద్రబాబుకు పార్టీ సీనియర్ నేత కరణం బలరాం ఓ పక్క కూర్చోగా... మరో పక్కన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, శిద్దా రాఘవరావు, రావెల కిశోర్ బాబు, బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, పార్టీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన గొట్టిపాటి రవికుమార్, ముత్తుముల అశోక్ రెడ్డి, పోతుల రామారావు ఆసీనులయ్యారు. దాదాపు పది నిమిషాలకు పైగానే అక్కడ గడిపిన చంద్రబాబు ఆ తర్వాత విజయవాడకు బయలుదేరారు.