: ‘బారిష్ మంత్రం’తో బురిడీ కొట్టిస్తున్న దొంగ బాబా!
‘లైఫ్ స్టైల్’ భవనం యజమాని మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని రూ. 1.33 కోట్లకు బురిడీ కొట్టించిన దొంగ బాబా బుడ్డప్పగారి శివ అలియాస్ శివానంద స్వామి తాను చేసే మోసాలకు ‘బారిష్' (వర్షం) మంత్రాన్ని ఉపయోగిస్తుంటాడట. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఈ మంత్రం ఉపయోగించి డబ్బు రెట్టింపు చేస్తానని, చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, బ్యాంకులలోని డబ్బు వచ్చి పడుతుందని, వర్షం కురిసినట్లు డబ్బు కురుస్తుందని నమ్మబలుకుతాడన్నారు. గత శుక్రవారం శివను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. బారిష్ మంత్రం ఉపయోగించి చేసే పూజ విజయవంతం కావాలంటే 21 గోళ్లు ఉన్న తాబేలు, 4.5 కిలోల కంటే ఎక్కువ బరువున్న రెండు తలల పాము, రైస్ పుల్లర్ గా పిలిచే ఇరీడియం, కాపర్ కాయిన్ లలో ఏదో ఒకటి ఉండాలని చెబుతుంటాడట. వీటికి చుట్టుపక్కల ఉన్న డబ్బును ఆకర్షించే లక్షణం ఉంటుందని, పూజలో పెట్టిన డబ్బును రెట్టింపు చేసే శక్తి కూడా ఉంటుందని నమ్మబలుకుతాడు. పూజకు కూర్చునే సమయంలో 1616 సంవత్సరం నాటి కాపర్ కాయిన్ ఒకటి తన వద్ద ఉందని శివ చెబుతాడని, పగడ్బందీగా పార్శిల్ చేసిన ఒక డబ్బాలో ఇది ఉంచానని పూజ చేయించుకునే వ్యక్తులను నమ్మిస్తాడని పోలీసులు చెప్పారు. ఆ కాయిన్ చూపించమని అడిగితే వారికి ఏదో విధంగా నచ్చచెప్పి చూడకుండా ఉండేలా చేస్తాడన్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2.00 గంటల సమయంలో పూజ ముగుస్తుందని... పూజలో పెట్టిన డబ్బు రెట్టింపుకాని విషయాన్ని యజమానులు గుర్తించి ప్రశ్నిస్తే కనుక, ఇది లంచ్ సమయమని, బ్యాంకులు ఇప్పుడు పనిచేయవని... అవి ప్రారంభం కాగానే డబ్బు వచ్చిపడుతుందని చెబుతూ కాలయాపన చేస్తాడని అన్నారు. ఉమ్మెత్త గింజలు, సీసం కలిపిన ప్రసాదాన్ని పూజ చేయించుకున్న వ్యక్తులకు పెట్టడం, వారు మత్తులోకి జారుకున్న తర్వాత పూజలో పెట్టిన డబ్బును పట్టుకుపోవడం జరుగుతుంటుందని పోలీసులు చెప్పారు. చాలా మంది దొంగ బాబాలు ఈ బారిష్ మంత్రాన్ని ఉపయోగించే దోచుకుపోతుంటారని పోలీసులు చెప్పారు. కాగా, శివ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నాడు.