: వేలు పెడితే రాజకీయ జోక్యం అంటారు... పట్టించుకోకుంటే నిందలా?: వాపోతున్న ఏపీ మంత్రులు
గతంలో ఉద్యోగుల బదిలీలు జరిగినప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తే, రాజకీయ జోక్యం ఎక్కువైందన్న విమర్శలు వచ్చాయని, ఇప్పుడు పట్టించుకోకుండా దూరంగా ఉంటే, పాలన సక్రమంగా లేదని, అధికారులతో సమన్వయం కోల్పోయామని అధినేత చంద్రబాబుతో నిందలు పడాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు వాపోతున్నారు. నిన్న బదిలీలపై కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, తన ఆలోచనల స్థాయిలో మంత్రులు పనిచేయడం లేదని క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. ఆపై, తానే స్వయంగా రోజూ మంత్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వస్తోందని, అధికారులతో సమన్వయం కొరవడిందని, పరిస్థితి మారాలని కాస్త కటువు వ్యాఖ్యలే చేశారు. తాజా వ్యవహారంతో సమన్వయ లోపం ఉద్యోగులు, మంత్రుల మధ్య కాకుండా, మంత్రులు, సీఎం మధ్యే నెలకొందన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో గత సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకునే, సీఎం చంద్రబాబు, ఈ దఫా దగ్గరుండి పర్యవేక్షించాలని మంత్రులను ఆదేశించారు. జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, జిల్లా మంత్రి, కలెక్టర్లు కలసి మొత్తం ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. గతంలో జరిగిన పరిణామాలు, ఎదుర్కొన్న విమర్శలను పరిగణనలోకి తీసుకున్న కొందరు మంత్రులు, తమకెందుకు లేనిపోని సమస్యలు అనుకుని, బదిలీలకు దూరంగా ఉన్నారు. అధికారులకే పూర్తి బాధ్యతలు అప్పగించి, ఆ పని పట్టీ పట్టనట్టు వ్యవహరించారు. మంగళవారం నాడు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో బదిలీల ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టారని మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, చినరాజప్పలపై ఉద్యోగులు ఫిర్యాదులు చేయగా, ముఖ్యమంత్రి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాని కొందరు మంత్రులపైనా బాబు అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు బాధ్యతా రాహిత్యంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని, ఎవరి శాఖలో బదిలీల గురించి వారికి తెలియకపోతే ఎలాగని అచ్చెన్నాయుడిని గట్టిగా అడిగారు. శ్రీకాకుళం జిల్లాలో మునిసిపల్ కమిషనర్ బదిలీపై తనకు కనీస సమాచారం కూడా అందలేదని, ఇక బదిలీలు ఎందుకు పట్టించుకోవాలని బదులివ్వగా, సీరియస్ అయిన చంద్రబాబు, ఎందుకిలా జరిగిందని పురపాలక మంత్రి నారాయణను ప్రశ్నించారు. ఆయన నుంచి ఎలాంటి సమాధానమూ రాకపోవడంతో, మంత్రుల మధ్య సమన్వయం, సఖ్యత కొరవడ్డాయని, ఇంత ఈర్ష్య భావాలు ఎందుకని మండిపడ్డారు. అత్యంత కీలకమైన కృష్ణా జిల్లాకు ఇన్ చార్జ్ గా ఉండి, బదిలీలను ఎందుకు పట్టించుకోవడం లేదని పుల్లారావును నిలదీశారు. రెవెన్యూ శాఖలో ఆర్డీఓలు, పోలీసు శాఖలో డీఎస్పీల బదిలీలు అత్యంత కీలకమైనవని, అవి తన అనుమతి మేరకు మాత్రమే జరుగుతాయని స్పష్టం చేశారు. ఇక టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా, మంత్రులు పాలనపై పూర్తి స్థాయి పట్టును సాధించలేకపోయారన్న విమర్శలు పెరుగుతున్నాయి. మంత్రులు మాత్రం బదిలీల్లో జోక్యం చేసుకుంటే లేనిపోని విమర్శలు వస్తాయని భయపడ్డామే తప్ప మరే కారణాలూ లేవని, తమ బాధను సీఎం అర్థం చేసుకోవడం లేదని అంటున్నారు.