: ఖైదీ కంటే హీనంగా చూశారు!... ముద్రగడ పట్ల పోలీసుల వైఖరిపై కాపుల ఫైర్!
కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కాపు నేతలు ఆగ్రహోదగ్రులయ్యారు. తుని విధ్వంసకారుల పేరిట అరెస్ట్ చేసిన కాపుల విడుదల, కేసుల ఎత్తివేతను డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష కొనసాగించిన ముద్రగడ... అరెస్టైన కాపులకు బెయిల్ రావడంతో దీక్ష విరమణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొద్దిసేపటి క్రితం తన సతీమణితో కలిసి రాజమహేంద్రవరం నుంచి తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహం చేరుకున్నారు. అనంతరం ఆయన నిమ్మరసం తాగి దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ముద్రగడను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో కాపు నేతలు కిర్లంపూడి వచ్చారు. ఈ సందర్భంగా ముద్రగడ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సామాజిక వర్గ డిమాండ్లను సాధించుకునేందుకు శాంతియుతంగా దీక్షకు దిగిన ముద్రగడను పోలీసులు ఖైదీ కంటే హీనంగా చూశారని వారు వ్యాఖ్యానించారు.