: భారత్ పై దాడికి ‘ఉగ్ర’ నేత హుకుం!... గొప్ప దేశంపై దాడి చేయలేనన్న ఉగ్రవాది: ఆసక్తి రేకెత్తిస్తున్న షార్ట్ ఫిలిం
ఈ ఏడాది జనవరిలో భారత 67వ గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారత దేశం గొప్పతనాన్ని విశదీకరిస్తూ, కొందరు చిత్రీకరించిన ఓ షార్ట్ ఫిలిం ప్రస్తుతం నెట్ లో ఆసక్తి రేకెత్తిస్తోంది. సదరు ఫిలింలో ఓ ఉగ్రవాద స్థావరంలో ముగ్గురు సూసైడ్ బాంబర్లతో సదరు ఉగ్రవాద సంస్థ నేత మాట్లాడుతున్నాడు. భారత్ పై దాడి చేయాలని ఆ ‘ఉగ్ర’ నేత జారీ చేసిన ఆదేశాలను మొదటి ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు అంగీకరించారు. వెనువెంటనే భారత్ పై విరుచుకుపడేందుకు వారు అక్కడి నుంచి బయలుదేరారు. మూడో ఉగ్రవాది వద్దకు వచ్చిన ఆ నేతకు ఊహించని షాక్ తగిలింది. భారత్ పై దాడి చేయమన్న నేత ఆదేశాలను ఆ ఉగ్రవాది తిరస్కరించాడు. అంతేకాక గొప్ప దేశంపై తాను దాడి చేయలేనంటూ నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆ తర్వాత భారత దేశం గొప్పతనానికి సంబందించిన విషయాన్ని విపులంగా వివరించిన అతడు సదరు ఉగ్రవాద స్థావరాన్ని నాశనం చేసేందుకు చేతిలో బాంబును పట్టుకుని పేల్చేస్తాడు. ఈ దాడిలో ఉగ్రవాద స్థావరం సహా అతడు కూడా ఆహుతి అవుతాడు. భారత్ గొప్పతనాన్ని అతడు వివరించిన వైనం ఆసక్తికరంగా ఉంది.