: మిషన్ భగీరథలో అవినీతిపై విచారణ జరపాలి: కాంగ్రెస్ నేతలు
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతోన్న మిషన్ భగీరథ అవినీతిమయం అయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న ఈ నేతలు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. మిషన్ భగీరథ అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా మాత్రమే ప్రభుత్వం పనిచేస్తోందని వారు వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని వారు అన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ అవినీతిమయంగా కొనసాగుతున్నాయని, స్కాంలుగా మారబోతున్నాయని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ గాల్లో వదిలేశారని వారు వ్యాఖ్యానించారు.