: పొలంలో పంటను ధ్వంసం చేసిన గండి బాబ్జీ!... మాజీ ఎమ్మెల్యేపై కేసు!
విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని సబ్బవరం పోలీస్ స్టేషన్ లో ఆయనపై నిన్న ఈ కేసు నమోదైంది. వివరాల్లోకెళితే... సబ్బవరం మండలం మొగిలిపురానికి చెందిన దేవుడమ్మ, శ్రీరాములు దంపతులు తమకున్న 20 సెంట్ల పొలంలో గంటి పంట వేశారు. సోమవారం గండి బాబ్జీ తన సోదరుడు, అనుచరులతో కలిసి ఈ పంటను ధ్వంసం చేశారు. వారి యత్నాన్ని అడ్డుకున్న బాధిత దంపతులపై మాజీ ఎమ్మెల్యే దాడి చేశారు. దీంతో షాక్ తిన్న బాధితులు సబ్బవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు గండి బాబ్జీ, ఆయన సోదరుడు రవికుమార్, మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సబ్బవరం ఎస్సై తెలిపారు.