: భారీ భద్రత నడుమ ప్రారంభమైన అనంతనాగ్ ఉప ఎన్నిక పోలింగ్
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబాముఫ్తీ బరిలో ఉన్న అనంతనాగ్ ఉప ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మంగళవారమే అనంతనాగ్ చేరుకున్న భద్రతా బలగాలు మొత్తం 102 పోలింగ్ స్టేషన్లలో భారీ భద్రత ఏర్పాటు చేశాయి. ఈ ఎన్నికను బహిష్కరించాలంటూ వేర్పాటు వాదులు, టెర్రరిస్టు గ్రూపులు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా చర్యలు చేపట్టారు. ఈ నియోజకవర్గంలోని 102 పోలింగ్ కేంద్రాలలో 52 అత్యంత సున్నితమైనవి కాగా, 50 సున్నితమైనవని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. మెహబూబాముఫ్తీ ప్రత్యర్థులుగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్ సీ) నుంచి ఇఫ్తికార్ హుస్సేన్ మిస్గర్, కాంగ్రెస్ నుంచి హిలాల్ అహ్మద్ షా బరిలో ఉన్నారు. తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న సీఎం మెహబూబాను ఓటర్లు ఏమేరకు పోలింగ్ లో పాల్గొంటారన్న అంశం ఆందోళనకు గురిచేస్తోంది. జనవరి 7న మెహబూబా ముఫ్తీ తండ్రి ముప్తీ మహమ్మద్ సయీద్ మృతితో ఈ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. జూన్ 25న ఫలితాన్ని ప్రకటిస్తారు.