: ప్రాజెక్టులకు అడ్డుపడేందుకే ప్రతిపక్షాలు ఏకమయ్యాయి: టీఆర్ఎస్
మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం చెల్లించడం లేదంటూ తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోన్న అంశంపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణలోని ప్రతి పక్ష పార్టీలన్నీ ఏకమై మల్లన్న సాగర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను రెచ్చగొడుతూ ప్రతి పక్షపార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వారు ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూ ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని చేయడం ఆపుకోవాలని టీఆర్ఎస్ నేతలు సూచించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్నికుట్రలు పన్నినా తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ఆపే ప్రసక్తే లేదని వారు ఉద్ఘాటించారు. అవినీతి జరుగుతోందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు హాస్యాస్పదమేనని అన్నారు. కాంగ్రెస్‌లో సమర్థత లేని నాయకులు ఉన్నారని, అందుకే వారు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపి, తమ పార్టీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు.