: యాజమాన్యంపై కోపాన్ని కుక్కలపై చూపిన కార్మికులు.. 24 కుక్కలు మృతి
తమకు జీతాలు ఇవ్వడం లేదన్న కారణంతో కార్మికులు 24 కుక్కలను చంపేసిన ఘటన కువైట్‌లోని షుయాబా నగరంలో చోటుచేసుకుంది. కస్టమర్లకు కుక్కలను సరఫరా చేసే ఓ కంపెనీ కార్మికులు ఈ చర్యకు ఒడిగట్టారు. తమకు రెండు నెలలనుంచి జీతాలు చెల్లించకపోవడంతో తమ కంపెనీ యాజమాన్యం మీద కోపాన్ని కొంతమంది కార్మికులు కుక్కలపై చూపించారు. కుక్కలకు ఆహారం, నీళ్లు ఇవ్వడాన్ని ఆపేశారు. దీంతో 24కుక్కలు చనిపోయాయి. కుక్కలు చనిపోయి పడి ఉన్న ఫోటోలు వెలుగులోకి రావడంతో ఆ దేశంలో ఇప్పుడు ఈ అంశంపై అలజడి రేగుతోంది. ఈ అంశంపై ఇస్మాయిల్ అల్ మిస్రీ అనే వ్యక్తి అక్కడి పోలీసులకి ఫిర్యాదు చేశారు. కుక్కలను సంరక్షించాల్సిన సిబ్బందే ఈ చర్యకు పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 99 కుక్కల పరిస్థితి ఇలాగే ఉందని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.