: ఫుట్ బోర్డుపై ప్రయాణించి పట్టుబడే విద్యార్థుల బస్ పాస్ లు రద్దు; తమిళనాట అమ్మ కీలక నిర్ణయం
సమయం మించి పోతున్నదనో లేక చాలినన్ని బస్సులు లేవనో ఫుట్ బోర్డుపై ప్రయాణించి, కిటికీలకు వేలాడుతూ, పాఠశాలలకు చేరుకునే విద్యార్థులపై అమ్మ సర్కారు సీరియస్ అయింది. ఇటీవలి కాలంలో బస్సుల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, దీన్ని అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తూ, పట్టుబడే విద్యార్థుల బస్ పాస్ లను రద్దు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం నాడు తమిళనాడు విద్యాశాఖ నుంచి సంచాలకులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కీలక వేళల్లో చాలినన్ని బస్సులు లేకపోవడంతోనే విద్యార్థుల ఫుట్ బోర్డు ప్రయాణం తమిళనాడులో సర్వసాధారణంగా కనిపించే అంశమే. గతంలో పోలీసులు కొన్ని కఠిన చర్యలు తీసుకుని రూ. 500 జరిమానా, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, టీసీలు ఇచ్చి పంపడం వంటి చర్యలు చేపట్టినా, అది కొంతకాలానికే పరిమితమైంది. మరో విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ, విలువైన విద్యార్థుల ప్రాణ నష్టాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జయలలిత సర్కారు చెబుతోంది.