: పరిస్థితి ఇలాగే ఉంటే మోదీ మాట ఎవరూ వినరంటున్న 600 మంది ఎన్నారైలు!
"ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నారైలు పెట్టుబడులతో రావాలని పదే పదే కోరుతున్నారు. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే ఇన్వెస్ట్ చేసేందుకు ఎవరూ రారు" ఇది ఓ ఎన్నారై చెబుతున్న మాట. దేశ రాజధానిలోని నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టిన దాదాపు 600 మందికి పైగా ఎన్నారైలూ ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రం సైతం కల్పించుకోవడం లేదన్నది వీరి వాదన. ఇంతకీ అసలేమైందంటే, ఢిల్లీ సమీపంలోని మనేసర్ లో స్పైర్ ఎడ్జ్ పేరిట ఓ నిర్మాణ సంస్థ ఓ భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఇక్కడ పెట్టుబడులు పెడితే, భారీ ఎత్తున రాబడి వుంటుందని వ్యాపార ప్రకటనల ద్వారా ఊదరగొట్టింది. ఈ ప్రకటనకు ఆకర్షితులై మొత్తం 1200 మందికి పైగా పెట్టుబడులు పెట్టగా, అందులో 600 మందికి పైగా ఎన్నారైలు రూ. 50 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టారు. "నా కుమార్తె వివాహం కోసం ఇండియాకు వచ్చాను. వ్యాపార ప్రకటనలు చూసి, ఇక్కడ పెట్టుబడి పెడితే, అద్దె రూపంలో మంచి ఆదాయం వస్తుందని రూ. 60 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. నా కలలు కల్లలయ్యాయి. ఇండియాకు వచ్చే ఆలోచనను సైతం విరమించుకున్నాను. కోర్టు కేసుల వల్ల ఎన్నో సార్లు ఇండియాకు తిరగాల్సి వచ్చింది. ఇకపై ఈ దేశంలో పెట్టుబడి పెట్టాలని నాకు లేదు" అని వీరేంద్ర జైన్ వ్యాఖ్యానించారు. యూఎస్ లోని 40 మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్టు వెల్లడించారు. వీరేంద్ర మాత్రమే కాదు, అందరిదీ ఇదే పరిస్థితి. "ఢిల్లీకి 50 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్న మనేసర్ లాంటి ప్రాంతంలో ఇలాంటి మోసం జరుగుతుందని మేము అనుకోలేదు. నిందితులపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. మోదీ ప్రభుత్వ పాలన ఇదేనా?" అని ఇదే ప్రాజెక్టులో రూ. 55 లక్షలు ఇన్వెస్ట్ చేసిన సింగపూర్ ఎన్నారై ప్రదీప్ శర్మ ప్రశ్నించారు. ప్రధాని కార్యాలయానికి, హర్యానా ప్రభుత్వానికి జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపించారు. "ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నారైలు ఇండియాకు పెట్టుబడులతో రావాలని కోరుతారు. పరిస్థితి ఇలా ఉంటే, పెట్టుబడులకు రక్షణ ఎక్కడ? ఎవరూ ఇండియాలో పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు" అని అన్నారు. సఫైర్ ఎడ్జ్ ప్రాజెక్టుకు నిధులను సమీకరించిన ఏఎన్ బిల్డ్ వెల్ సంస్థ ఆ నిధులను ఇతర ప్రాజెక్టులకు మళ్లించగా, ఈ కమర్షియల్ ప్రాజెక్టు ఆగిపోయింది. 2010-11 నుంచి నిధులను సేకరించిన సంస్థ మొత్తం రూ. 41 కోట్లను మళ్లించినట్టు తెలుస్తోంది. సంస్థ లావాదేవీల్లో అవకతవకలు చోటు చేసుకోవడం, ఆపై సంస్థ దివాలా దిశగా సాగినట్టు చూపడంతో, ఎన్నారైల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం మినహా మరేమీ చేయలేని పరిస్థితి నెలకొందని, ఇదే ప్రాజెక్టులో ఇన్వెస్టర్, రిటైర్డ్ పోలీస్ అధికారి జేపీ సాయల్ వ్యాఖ్యానించారు.