: పుదుచ్చేరిలో లుకలుకలు... కిరణ్ బేడీ ఆహ్వానించినా వెళ్లని సీఎం, మంత్రులు!
కేంద్రపాలిత ప్రాతం పుదుచ్చేరిలో కొత్తగా ఏర్పాటైన నారాయణస్వామి ప్రభుత్వానికి, రాష్ట్రానికి కొత్తగా లెఫ్టినెంట్ గవర్నరుగా వచ్చిన కిరణ్ బేడీకీ మధ్య విభేదాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు స్పష్టంగా బయటపడ్డాయి. ఈ ఉదయం తాను నిర్వహిస్తున్న యోగా డే వేడుకలకు రావాలని కిరణ్ బేడీ స్వయంగా ఆహ్వానం పంపినప్పటికీ, ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా డుమ్మా కొట్టారు. ఈ సమయంలో తాము మరో కార్యక్రమానికి వెళ్లాల్సి వుందని వారు వెల్లడించారు. ఈ విషయంపై కిరణ్ బేడీ స్పందిస్తూ, "యోగా దినోత్సవం రోజున రాజకీయాలు వద్దు. నా పని నేను చేసుకు పోతున్నాను" అన్నారు. గత నెలలో కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరిలో అధికారాన్ని తిరిగి సాధించగా, ఆ వెంటనే 2015 ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడి, ఓటమిపాలైన కిరణ్ బేడీని లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమిస్తూ, ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఆమె తన అధికార పరిధులను దాటి పరిపాలనలో కలగజేసుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోపించింది.