: అమ్మకు చికిత్స కోసం 90 లక్షలు దొంగిలించిన యువకుడు


అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి చికిత్స చేసేందుకు డబ్బులు లేక పనిచేస్తున్న ఇంటికే కన్నం వేశాడో కుమారుడు. ఏకంగా 90 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకొచ్చాడు. అయితే అమ్మకు చికిత్స చేయించకుండానే పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని బాబ్రల్ గ్రామానికి చెందిన బ్రిజేష్ ఢిల్లీలో ఓ ఇంట్లో పనిమనిషిగా ఉంటున్నాడు. బ్రిజేష్ పనితీరు, ప్రవర్తన నచ్చకపోవడంతో ఇంటి యజమాని నమ్రతా కుమారి అతడిని పనిలోంచి తీసేసింది. దీంతో ఇంటికి వెళ్లిపోయిన ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసి బాధపడ్డాడు. ఆమెకు ఎలాగైనా చికిత్స చేయించాలని, అందుకు అవసరమైన డబ్బులు సంపాదించాలని భావించి తిరిగి ఢిల్లీ చేరుకున్నాడు. గతంలో తను పనిచేసిన ఇంటికే వెళ్లాడు. యజమానురాలు యూరప్ వెళ్లిందని తెలుసుకున్న బ్రిజేష్ గతంలోలానే ఇంట్లోకి వెళ్లి పనులు చేయడం ప్రారంభించాడు. నమ్రత అతడిని తిరిగి పనిలోకి తీసుకుందని అనుకున్న కుటుంబ సభ్యులు అడ్డుచెప్పలేకపోయారు. దీన్ని అవకాశంగా తీసుకున్న బ్రిజేష్ ఈనెల 8న రూ.90 లక్షల విలువ చేసే 11 వజ్రాల నెక్లస్ లు, 8 వజ్రాల గాజులు, 24 బంగారం టాప్ లు, 20 ఉంగరాలు, రూ. 20వేల నగదు తీసుకుని ఇంటి నుంచి పరారయ్యాడు. ఈనెల 16న యూరప్ నుంచి వచ్చిన నమ్రత ఇంట్లోని బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. విషయం కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇది వారం రోజులుగా కనిపించకుండా పోయిన బ్రిజేష్ పనే అయి ఉంటుందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు ఆదివారం బ్రిజేష్ ఇంటిపై దాడిచేసి నగల బ్యాగుతోపాటు రూ.8,500 నగదు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. నమ్రత యూరప్ వెళ్లడంతో తన పని సులువైందని, అమ్మకు చికిత్స చేయించేందుకు తప్పని పరిస్థితుల్లో దొంగతనం చేయాల్సి వచ్చిందని బ్రిజేష్ పోలీసులకు వివరించాడు. చివరికి తల్లికి వైద్యం చేయించకుండానే కటకటాల వెనక్కి చేరాడు.

  • Loading...

More Telugu News