: 'మనిషి ఎముకలు నుజ్జు' చేస్తాం.. అంటూ యాడ్ ఇచ్చిన ముఠా!


ఎటువంటి వారినైనా యాడ్స్ ఇట్టే ఆకర్షిస్తాయి. యాడ్స్ ముఖ్య ఉద్దేశం బిజినెస్ ను మరింత పెంచుకోవడం. మల్టీ నేషనల్ కంపెనీ అయినా, కుటీర పరిశ్రమ అయినా తమ ఉత్పత్తులను విక్రయించేందుకు యాడ్స్ ను వాడుకోవడం మామూలే. అయితే ఈ యాడ్ మాత్రం అందుకు భిన్నం. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ కు గురవుతున్నారు. జలంధర్ కు చెందిన గోపి రుక్రా మరో ఐదుగురు సభ్యులతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. శత్రువులు ఉండీ వారిని ఏమీ చేయలేని నిస్సహాయుల కోసం రుక్రా తాజాగా ఓ వీడియోతో యాడ్ రూపొందించాడు. అందులో రక్తమోడుతున్న ఓ అమాయకుడిని పట్టుకుని అతడి ఎముకలను ఎక్కడికక్కడ విరిచేశాడు. తనను వదిలేయమని వేడుకుంటున్నా ఏమాత్రం కనికరం లేని ముఠా.. అతడి శరీరాన్ని మెలితిప్పారు. ఈ వీడియోను సోషల్ మీడియా, వాట్సాప్ లో అప్ లోడ్ చేశారు. శత్రువులు ఉన్నవారు తనను సంప్రదించాలని, వారి ఎముకలను వీడియోలో చూపించినట్టు విరిచేస్తామని అందులో పేర్కొన్నారు. దీనిని చూసిన ఫగ్వారా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరు 27 కేసుల్లో నిందితులని పోలీసులు తెలిపారు. కాగా వారి యాడ్ కు విశేష స్పందన వచ్చింది. ముగ్గురు ఇప్పటికే వీరితో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరిలో ఇద్దరి ఎముకలు నుజ్జు చేసి కాంట్రాక్ట్ పూర్తి చేసుకోగా మరొకరి పనిపట్టే సమయంలో పోలీసులకు చిక్కారు. యాడ్ వీడియోతోపాటు ఆయుధాలతో ఉన్న తమ ఫొటోలను కూడా వీరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్టు ఎస్టీఎఫ్ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ హెచ్ పీఎస్ ఖాన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News