: ఆనం మొసలి కన్నీరు విడ్డూరం: నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి అంటూ ఆనం వివేకానందరెడ్డి మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నెల్లూరులో వివేకా చేసిన ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ, వివేకానందరెడ్డి హయాంలో మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతిని బహిర్గతం చేస్తామని అన్నారు. తాను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి కార్పొరేషన్ కు 40 కోట్ల రూపాయల అప్పు మిగిల్చారని ఆయన తెలిపారు. కనీసం విద్యుత్, డీజిల్ బిల్లులు చెల్లించేందుకు కూడా నిధులు లేవని ఆయన చెప్పారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ లో కమిషనర్ గా పని చేసిన ఉమాపతిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే, ఆయనను ఆర్జేడీని చేసిన ఘనత వివేకానందరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డిలదేనని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆనం, మాజీ మేయర్ భానుశ్రీ అక్రమాస్తుల కేసు ఎందుకు తొక్కిపట్టారని ఆయన ప్రశ్నించారు.