: నెగ్గిందెవరు?...ముద్రగడా?...ప్రభుత్వమా?


తుని ఘటనలో నిందితులందరికీ బెయిల్ మంజూరు కావడంతో, కాసేపట్లో కాపు రిజర్వేషన్ ఉద్యమ ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ దీక్ష సందర్భంగా విజయం ఎవరిని వరించింది? అనే ఆసక్తి అందర్లోనూ రేగుతోంది. మొండివాడు రాజుకంటే బలమైన వాడు అనే సామెతను ఈ సందర్భంగా ప్రభుత్వము, ముద్రగడ ఇద్దరూ నిజం చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని, ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాబు అధికారం చేపట్టి 15 నెలలైనా ఎలాంటి చర్యలు కనిపించకపోవడంతో ముద్రగడ తునిలోని కొబ్బరి తోటలో సమావేశం నిర్వహించాలని భావించారు. సమావేశం సందర్భంగా తీవ్రమైన పరిణామాలు చోటుకుని, విధ్వంసం జరిగింది. దీంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి, కాపు సామాజిక వర్గ నేతలను రంగంలోకి దించి, ముద్రగడతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేసింది. అనంతరం జరిగిన విధ్వంసంపై కేసులు నమోదు చేయాలని భావించినా, ప్రతికూల ప్రభావం ఉండే ప్రమాదంతో ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఈ క్రమంలో అధికార పార్టీ కాపు సామాజిక వర్గ నేతలు ముద్రగడకు వ్యతిరేకంగా గళం ఎత్తడంతో పాటు, కాపులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ముద్రగడను ఇరుకునపెట్టేందుకు, ఆయన వెన్నంటి ఉన్న వారిపై కేసులు నమోదు చేసింది. దీనిపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విధానం సరికాదని, కాపులకు ఇచ్చిన హామీలు యుద్దప్రాతిపదికన తీర్చాలని హెచ్చరిస్తూ, అరెస్టు చేసిన 13 మందిని విడుదల చేయాలంటూ నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం గట్టిగా సంకల్పించుకుని ఉంటే...ముద్రగడ దీక్షను ఆ రోజే విరమింపజేసేది. కానీ అలా భావించలేదు. అందుకే ముద్రగడ దీక్ష చేపట్టిన రోజే నిందితులను పోలీసులు న్యాయస్థానం ముందు నిలబెట్టారు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో విచారణ పేరుతో వారిని లోపల ఉంచింది. దీక్ష చేపట్టిన ముద్రగడకు కాపు సామాజిక వర్గంలో ఉండే ప్రాధాన్యం, ఆయనపై చర్యలు తీసుకుంటే భవిష్యత్ లో ఎదురయ్యే ఆందోళనలు తదితరాలను అంచనా వేసి నిర్ణయం తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీంతో కాపుల్లో ఆందోళన రేగింది. ఇంతలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కాపు నేతలు స్వరం పెంచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలేంటని నిలదీయడం ప్రారంభించారు. దీంతో తేరుకున్న జేఏసీ... హైదరాబాదులో ఏపీ నేతలుగా ఉన్న కాపు నేతలను, తమ సామాజిక వర్గానికి చెందిన ప్రజాదరణ ఉన్న నేతలను జేఏసీ నేతలు కలవడం, వారు ముద్రగడకు మద్దతు తెలపడం జరిగిపోయాయి. దీంతో ముద్రగడ దీక్ష చేపట్టిన నాలుగు రోజుల తరువాత వారు గొంతు విప్పడం ప్రారంభించారు. వారి ఒత్తిడికి తలొగ్గింది. ప్రభుత్వం తలచుకుంటే ఒక్క రోజులో బెయిల్ ఇవ్వవచ్చు అంటూ ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు...కాపు సామాజిక వర్గంలో, ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం నిందితుల్లో 10 మందికి బెయిల్ వచ్చేలా చేసింది. అందరికీ బెయిల్ ఇస్తేనే దీక్ష విరమిస్తానని ముద్రగడ స్పష్టం చేయడంతో ఎట్టకేలకు 13 రోజుల తరువాత బెయిల్ వచ్చేలా చేసింది. కాగా, 14 రోజుల రిమాండ్ లో 13 రోజులు జైలులోనే వారిని ఉంచడంతో ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. మరోవైపు వారిని బెయిల్ గడువుకు ముందుగా విడుదల చేయడంతో ఆ సామాజిక వర్గం ఆదరణ కోల్పోకుండా ఉండే ప్రయత్నం చేసింది. దీంతో ప్రభుత్వ అనుకూల వర్గం ఇది ప్రభుత్వ విజయం అని పేర్కొంటుండగా, 13 రోజుల దీక్షతో...ముద్రగడకు ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేశాననే సంతృప్తి మిగలనుంది. విజయం విషయానికి వస్తే...అన్వయించుకునే వారిదే విజయం అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటుండడం విశేషం.

  • Loading...

More Telugu News